కలం, వలిగొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) కాల పరిమితి 2025 ఫిబ్రవరి 14తో ముగియగా మరో ఆరు నెలల పాటు అంటే ఆగస్టు 14 వరకు కాల పరిమితిని పొడిగించింది. పొడిగించిన కాలపరిమితి కూడా ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్యాక్స్ పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. నాటి నుంచి పర్సన్ ఇన్ ఛార్జిలు పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయనుండడంతో మరోసారి ప్యాక్స్ పాలకవర్గాల నియామకాల గురించి కదలికలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే గతంలో మాదిరిగా ఎన్నికల ద్వారా కాకుండా నామినేటెడ్ గా ఎన్నుకునే పద్ధతిని ప్రభుత్వం అనుసరించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా నామినేటెడ్ పద్ధతిలో రిజర్వేషన్లు కూడా లేనట్లు తెలుస్తుంది. అదే జరిగితే ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఏర్పడనుంది.
ఎవరినీ పదవులు వరిస్తాయో..?
వలిగొండ మండలంలో మొత్తం మూడు వలిగొండ, అరూర్, నూతనంగా వర్కట్పల్లి ప్యాక్స్ ఉండగా రిజర్వేషన్లు లేనట్లయితే నామినేటెడ్ ద్వారా ఎన్నుకున్నట్లయితే పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావాహులు చర్చించుకుంటున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాల పాలకవర్గాలను నియమించినట్లయితే వలిగొండ మండలంలో మొత్తం మూడు ప్యాక్స్ ల పరిధిలో మొత్తం 42 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ముందే ప్యాక్స్ పదవులు భర్తీ అయితే పదవులు పొందిన వారు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గ్రామాల్లో కష్టపడి పనిచేసి గెలిపించుకునే అవకాశం ఉంది. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీని జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికార పార్టీ నాయకులు ఎవరెవరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని అంతర్గతంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

