Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజారోగ్యంపై నిర్లక్యం వద్దు: ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: వైద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని, ప్రజారోగ్యం (Healthcare) పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్యశాల మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడా మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి అందుబాటులో ఉన్న వనరులతోనే నాణ్యమైన చికిత్స అందించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

వైద్య సేవలు మరింత బలోపేతం..

వైద్యశాలల్లో రోగులకు, సహాయకులకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. పారిశుద్ధ్యం, నీటి వసతి వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయాలని, మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, అవసరమైన వైద్య పరికరాలు మరియు మందుల నిల్వలపై సమగ్ర నివేదికను వెంటనే తనకు అందజేయాలని అధికారులను కోరారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా జవాబుదారీతనంతో పనిచేయాలని, అప్పుడే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>