కలం, మెదక్ బ్యూరో : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె (RTC Strike) బాట పట్టిన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభావం కన్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల్లో 1,043 మంది కండక్టర్లు ఉండగా, 869 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరంతా సమ్మెలోకి వెళ్లారు. డిపోలో కార్మికులు విధులు బహిష్కరించి ఉదయం బస్ డిపో ఎదుట నిరసన తెలిపారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల్లో సమ్మెలో వందలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ బస్ డిపోల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె (RTC Strike) నేపథ్యంలో డిపోల వద్ద పెద్దఎత్తున పోలీసులు మోహరించారు.
ఉద్రిక్తతలకు కేంద్రాలుగా బస్ డిపోలు..
సమ్మె కారణంగా సంగారెడ్డి, మెదక్, నారయణ ఖేడ్ ల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు సహాయంతో బస్టాండ్ ల నుంచి ప్రైవేటు అద్దె బస్సు సర్వీస్ ప్రారంభించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఘర్షణకు దారితీసింది. అద్దె బస్సులను బస్టాండ్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని, బస్సు సర్వీసులు నిలిపివేయాలని బస్సుకు అడ్డంగా వెళ్ళి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టి పోలీసు ఎస్కార్ట్ వాహనాలతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల బస్సులకు ఫుల్ డిమాండ్
సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులను కలుపుకొని ఉంటుంది. దీంతో ముంబై నేషనల్ హైవే, నాందేడ్ అకోలా హైవే పై ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సు సర్వీసులు ఆపరేట్ అవుతుంటాయి. ముఖ్యంగా బీదర్ నుండి, నాందేడ్ వైపు వందలాది బస్సులు రోజు వస్తూ వెళ్తుంటాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టడంతో ఇతర రాష్ట్రాల బస్ సర్వీసులు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. TGSRTC బస్సులు నిలిచిపోవడంతో కర్ణాటక రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రయాణికులు ఆశ్రయించారు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కర్ణాటక బస్సుల్లో పెద్దఎత్తున తెలంగాణ ప్రయాణికుల ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా నాందేడ్- అకోలా హైవే వైపు పిట్లం- బిచ్కుంద వైపు మార్గం మహారాష్ట్ర బస్సులు తెలంగాణ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సమ్మెను సొమ్ముచేసుకోనే పనిలో భాగంగా ఇతర రాష్ట్రాల సర్వీసులు పెంచినట్టు తెలుస్తోంది. మరికోన్ని రోజులు సమ్మె జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో రేపటి నుండి మరిన్ని ఇతర రాష్ట్రాల బస్సులు వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి..
ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులకు సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెకర్లు, ఆర్టీసి అధికారులు దృష్టి పెట్టారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తూ.. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నంబర్ 9391942254 ఏర్పాటు చేశారు.
జిల్లాలోని బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఉన్న అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బస్ డిపోల పరిధిలో కొత్తగా కండక్టర్ లను, డ్రైవర్లను నియమించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పోలీస్ , రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

