ఇల్లందు అభివృద్ధికి రూ.50 కోట్లు: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు రెండు విడతల్లో మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హామీ ఇచ్చారు. బుధవారం ఇల్లందు పర్యటనలో భాగంగా 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛైర్ పర్సన్ కిరణ్ మిత్ర ఛాంబర్ ను ప్రారంభించారు. అనంతరం, మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామన్నారు.

అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు..

ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ పాలకవర్గం ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధం పెంచుకుంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అనుభవం లేదని భావించకుండా, అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>