కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు (RTC Retired Employees) హైదరాబాద్ (Hyderabad)లోని బస్ భవన్ ఎదుట ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రిటైర్డ్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. పదవీ విరమణ పొందినా తమకు న్యాయంగా దక్కాల్సిన బెనిఫిట్స్ దక్కడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆర్పీఎస్ 2017, 2021 ఏరియర్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్స్, గ్రాట్యూటీ బకాయిలు అందాల్సి ఉందన్నారు. దీనిపై అధికారులకు ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. ఇక తప్పని పరిస్థితుల్లో దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయంగా దక్కాల్సిన బెనిఫిట్స్ అందించాలని, లేదంటే తమ నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు దీక్ష నేపథ్యంలో బస్ భవన్ వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

