కలం, వెబ్ డెస్క్: లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భారతీయ రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ విషయమై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బ్రిజ్ భూషణ్‌ను వ్యతిరేకంగా తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని, ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తేల్చి చెప్పారు. బ్రిజ్ భూషణ్ తీరుకు వ్యతిరేకంగా 2023 నుంచి దేశవ్యాప్తంగా రెజ్లర్ల నిరసనలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు. బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకు మొత్తం వ్యవస్థ పని చేసిందని వినేశ్ ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం కోసం తాము ఎంతో ధైర్యం ప్రదర్శించామన్నారు. కానీ బ్రిజ్ భూషణ్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఫిర్యాదులను ఉపసంహరింపజేశారని వినేశ్ తెలిపారు. అయినప్పటికీ పలువురు మహిళా రెజ్లర్లు చివరి వరకు ధైర్యంగా పోరాడారన్నారు. కోర్టు తీర్పు తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టును మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా షేర్ చేస్తూ తీర్పుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

