ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు.. ఆ డిమాండ్స్ కి గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్ : TGSRTC Strike | కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో అధికారుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. సమ్మెకు కారణమైన మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్దిష్ట టైమ్ బౌండ్ డెడ్‌లైన్ పెట్టుకుని పూర్తి చేయడానికి మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియపై అధికారులు అన్ని వివరాలను అధ్యయనం చేశారు. కార్మిక సంఘాల (ట్రేడ్ యూనియన్) ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించుకుని ఫైనల్ చేసుకోవాలని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను చెల్లించడానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. సమ్మె విరమణపై  కార్మిక సంఘాల జేఏసీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన చర్చల్లో పై నిర్ణయాలు జరిగాయి. ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులు, ఈవీ (ఎలక్ట్రిక్) బస్సులు వచ్చినా ఉద్యోగాలు పోవని ప్రభుత్వం ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత ఉంటుందనే భరోసా లభించింది. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) గురించి, వారి సంక్షేమం ఊసే ఎత్తలేదని, చర్చలకు పిలవనే లేదనే అంశాన్ని సైతం జేఏసీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం సమ్మె రెండో రోజునే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని స్వచ్ఛందంగా పిలుపు ఇచ్చారని, దానికి కొనసాగింపుగా అధికారుల కమిటీకి, డిప్యూటీ సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందానికి ఆదేశాలు ఇచ్చారని, ఆ ప్రకారమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయన్న అంశం సైతం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయమే ఉన్నదని, ఆ సంస్థను కాపాడుకోవాలన్న తపనతోనే మహాలక్ష్మి స్కీమ్‌తో ఆదాయం పడిపోతున్నా ప్రభుత్వం రీఇంబర్స్ చేసి కాపాడుతున్నదనే అంశంపైనా ప్రతినిధులు రియలైజ్ అయ్యారు.

గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి కొనసాగితే ఇప్పుడు ప్రతి నెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే వస్తున్నదని, ఒక డీఏ కూడా పెండింగ్‌లో లేకుండా క్లియర్ అయ్యాయన్న అంశంపైనా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. పీటముడిగా ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం కొలిక్కి వచ్చింది. పీఆర్సీ బకాయిల విషయంలోనూ ఒక షెడ్యూలు ఫిక్స్ చేసి ఆ ప్రకారం విడతల వారీగా విడుదల చేయడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రభుత్వంలో విలీనం చేసే అంశం గురించి మరిన్ని దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత లీగల్ అంశాలను పరిగణనలోకి ప్రభుత్వం ఒక స్పష్టతకు వస్తుందనే అంశం డిప్యూటీ సీఎం టీమ్‌తో జరిగిన చర్చల సందర్భంగా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

‘కాంగ్రెస్ హయాంలోనే దశాబ్దాల పెండింగ్ సమస్యలకు పరిష్కారం’

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దశాబ్దాల పెండింగ్ సమస్యలు పరిష్కారమయ్యాయని ఆర్టీసీ సంఘాల నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లో 52 రోజుల సమ్మె చేసినా, పలు హామీలు గుప్పించినా నెరవేరలేదన్న అభిప్రాయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం కాంగ్రస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే 2013 నాటి బాండ్లకు సంబంధించిన రూ. 280 కోట్లు క్లియర్ అయ్యాయని, 2017 సంవత్సరానికి సంబంధించి పీఆర్సీ బకాయిలు పాక్షికంగా విడుదలయ్యాయని, పెండింగ్‌లో ఉన్న డీఏలన్నీ క్లియర్ అయ్యాయని, గత ప్రభుత్వంలో సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి త్రిసభ్య కమిటీ చొరవతో 270 మందికి ఉద్యోగాలు వచ్చాయని, సహకార సొసైటీ బకాయిలతో పాటు ప్రావిడెంట్ ఫండ్ పెండింగ్ ఫండ్స్ తీరిపోయాని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. యూనియన్లు లేని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదని మంత్రులకు ఆర్టీసీ జేఏసీ వివరించింది.

Read Also: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>