కలం, వెబ్ డెస్క్: అయోధ్యలో విరాళాల లెక్కింపుల్లో చోరీ జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తొలిసారి స్పందించింది. ఈ మేరకు జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘ఈ ఘటన మాతో సహా అశేష భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. రాముడి భక్తులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరిని కలిచివేసింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ విన్నపం మేరకు యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.
అన్ని వ్యవస్థలు బలోపేతం..
విరాళాల చోరీ అంశం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించాలని జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. కోట్లాది మంది రాముడి భక్తులతో ముడిపడిన ఈ అంశంలో నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితులకు వీలైనంత త్వరగా ముగింపు పలికాలని.. ఆలయ ట్రస్ట్, సిట్ ఇందుకు చొరవ చూపాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దని, అన్ని వ్యవస్థలు బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
పారదర్శకతకు పెద్దపీట..
ఇక నుంచి ఆలయ విరాళాలతో సహా ప్రతీ అంశంలో పారదర్శకతకు పెద్ద పీట వేయాలని దత్తాత్రేయ హోసబలే ట్రస్ట్ బోర్డుకు సూచించారు. ఆర్థిక సేవల నిర్వహణలో అత్యంత నిజాయతీ పాటించాలన్నారు. ఇక మీదట శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ హిందూ సమాజ నమ్మకాన్ని చూరగొనేలా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులు మరింత సంయమనం పాటించాలని కోరారు. ఈ ఘటనను బూచిగా చూపి హిందూ వ్యతిరేక శక్తులు.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విన్నవించారు.

