మహిళా సాధికారతే మోదీ లక్ష్యం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో : మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా స్వావలంబన సాధించడమే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, త్వరలోనే చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు  అమలు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని (Karimnagar) ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ సీఎస్‌ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్‌లను  మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా ఆర్థికాభివృద్ధి సంఘం చైర్‌పర్సన్ శోభారాణి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవోతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో ఆటోలు, ట్రాలీ ఆటోలు పంపిణీ చేసినట్లే, ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కుట్టు మిషన్‌లను మహిళలకు అందజేశామని తెలిపారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. మహిళలే కుటుంబానికి, సమాజానికి వెన్నెముక అని పేర్కొన్న ఆయన, మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ లభించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

మోదీ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పలు పథకాలను బండి సంజయ్ వివరించారు. ఉజ్వల యోజన ద్వారా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు , ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళల పేరుతో ఇళ్ల మంజూరు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణీలకు ఆర్థిక సాయం, ముద్రా యోజన కింద మహిళలకు రుణాలు, బేటీ బచావో–బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, నమో డ్రోన్ దీదీ, జన్ ధన్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు(Women Empowerment) కేంద్రం పెద్దపీట వేస్తోందని అన్నారు. అలాగే నారీ శక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలోనే ఈ రిజర్వేషన్లు అమలులోకి వచ్చి పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>