కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎటుచూసినా కల్తీ కలకలం రేపుతోంది. బేకరీ ఐటమ్స్ మొదలుకొని ఇంట్లో వాడే అల్లం పేస్ట్ వరకు సర్వం కల్తీమయమవుతోంది. ఇక నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే చికెన్ సైతం భారీగా కల్తీ అవుతోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ‘ఈగల్ ఫిషరీస్’లో భారీ ఎత్తున కుళ్లిన కోడి మాంసం (Rotten Chicken) నిల్వలను అధికారులు గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది. హెచ్-ఫాస్ట్ (H-Fast) ఎస్ఐ పి. అభిలాశ్, జీహెచ్ఎంసీ వెటర్నరీ డాక్టర్ వాసు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిల్వ ఉంచిన ఈ కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపార సంస్థకు రూ.3,000 జరిమానా విధించారు. తదుపరి కఠిన చర్యల నిమిత్తం ఈ కేసును వెటర్నరీ విభాగానికి బదిలీ చేశారు. మాంసం ప్రియులు బయట కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఒక్క సికింద్రాబాద్‌లోనే కాకుండా హైదరాబాద్ లో పలు చోట్ల చికెన్ కల్తీ అవుతున్నట్లు అధికారులు గుర్తించడం గమనార్హం.
కుళ్లిన చికెన్ తింటే కలిగే నష్టాలివే
- జీర్ణక్రియ సమస్యలు
- వాంతులు, విరేచనాలు
- డీహైడ్రేషన్
- తీవ్ర జ్వరం
- తలనొప్పి, అలసట
- అవయవాలపై ప్రభావం

