Mobile Popup Ad
Mobile Popup Ad

గులాబీ రేకులతో మెరిసే చర్మం.. ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే!

కలం, వెబ్ డెస్క్: సాధారణంగా మనం గులాబీ పువ్వులను అలంకరణలో వాడుతుంటాం. అయితే, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడంలో కూడా గులాబీ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవును సౌందర్య సంరక్షణలోనూ గులాబీలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. చర్మ సంరక్షణకు గులాబీ రేకులు (Rose Petals) అద్భుతమైన సహజ నివారణగా పనిచేస్తాయట. ఇవి చర్మానికి తేమను అందించి, మచ్చలను తగ్గించి, సహజమైన గులాబీ రంగు మెరుపును తెస్తాయి. గులాబీ రేకుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి. అయితే గులాబీ రేకులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు..

గుప్పెడు గులాబీ రేకులు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్ వేసుకోవాలి. అరగంటయ్యాక సబ్బు ఉపయోగించకుండా నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ చిట్కాను తరచూ పాటిస్తుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

చర్మం తేమను కోల్పోకుండా..!

గులాబీ రేకుల పేస్ట్ కు ఫేస్ క్రీం కొద్దిగా కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ కూడా వేసుకోవచ్చట. ఫలితంగా చర్మం తేమగా మారుతుంది. అలాగే పెదాలపై దీన్ని అప్లై చేసుకోవడం ద్వారా గులాబీ రంగు పెదవులను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

ముఖ కాంతికి..

గులాబీ రేకులను చిక్కటి పెరుగులో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్ గా అప్లై చేసుకొని 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుందని సూచిస్తున్నారు.

నల్ల మచ్చలను చెక్

గులాబీ రేకులను ఎండబెట్టి తయారు చేసిన పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే దీన్ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. కొద్దిగా గులాబీ పొడిలో చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ అప్లై చేసుకొని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మెరిసే చర్మం కోసం

రెండు చెంచాల గంధం పొడి, పావు కప్పు పాలు, గుప్పెడు గులాబీ రేకులు తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలట. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా అప్లై చేసుకొని ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుపుని సంతరించుకుంటుందట.

అలాగే రోజ్ వాటర్ లో ముంచిన దూదితో రోజూ ఉదయాన్నే ముఖాన్ని తుడుచుకోవడం వల్ల చర్మం నిగారిస్తుందట. అయితే ఈ చిట్కాలు సహజసిద్ధమైనవే అయినప్పటికీ.. చర్మతత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>