Mobile Popup Ad
Mobile Popup Ad

వాహనదారులకు అలర్ట్​.. ట్రాఫిక్ చలాన్లకు నో ఎస్కేప్ రూట్!

కలం, తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు ఇవ్వడానికి కొత్త విధానం (E-Challan) అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావాలని మోటారు వాహన చట్టానికి కేంద్ర రవాణా శాఖ సవరణ చేసింది. అన్ని రాష్ట్రాలూ దీని స్ఫూర్తితో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు జారీచేసే చలాన్ల సమాచారాన్ని నేరుగా వాహనదారులకు ఎలక్ట్రానిక్ మెసేజ్ రూపంలో వెళ్లేలా మార్పులు చేసింది.

ఇందుకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేసి ప్రతీ వాహనదారు వారి మొబైల్ నెంబర్‌ను, వాట్సాప్ నెంబర్‌ను, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వాహన్ డాట్ పరివాహన్ అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన తర్వాత నెల రోజుల గడువు ఉంటుందని పేర్కొన్నది. అప్పటికల్లా అప్‌డేట్ చేసుకోకపోతే అందులో ఉన్నవే సరైనవని భావించాల్సి వస్తుందని పేర్కొన్నది. వాహనదారులు ఈ నిబంధనలను ఆ సైట్‌లో నమోదు చేయడం తప్పనిసరి.

మెసేజ్ రూపంలోనే చలాన్లు..

ఇప్పటివరకూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి పోస్టు ద్వారా రాతపూర్వకంగా చలాన్లు పంపించే విధానం ఇక నుంచి మారనున్నది. చలాన్ వివరాలను ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా వాహనదారుకు ఎలక్ట్రానిక్ రూపంలో చేరుతుంది. ఈ నూతన విధానం ద్వారా “నాకు సమాచారం రాలేదు.. ఇంటికి పోస్టల్ చలాన్ రాలేదు.. నాకు తెలియదు..” ఇలాంటి సమాధానాలు చెప్పి తప్పించుకునే అవకాశం లేదు.

ఎలాగూ వాహన్ పరివాహన్ పోర్టల్‌లో వివరాలు నమోదై ఉన్నందున అవి వినియోగంలో ఉన్నవనే భావించి మెసేజ్ పంపినట్లుగానే ట్రాఫిక్ పోలీస్, ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్లు భావిస్తాయి. లీగల్‌గానూ ఇది చెల్లుబాటు అవుతుంది. ఎక్కడ ఉన్నా ఈ మూడు పద్ధతుల్లో వివరాలు వెళ్తున్నందున తప్పించుకునే అవకాశమే లేదు. ఒకవేళ చలాన్ వేయడానికి సరైన కారణాలు లేవని వాహనదారు భావిస్తే గ్రీవెన్స్ రూపంలో ఎవరిని సంప్రదించాలో కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

దేశమంతా ఒకే లీగల్ సిస్టమ్..

ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, తిరువనంతపురం, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఈ-చలాన్ విధానం అమల్లో ఉన్నది. వాహనదారులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ఒక డెడికేటెడ్ నెంబర్‌ను దీనికోసం వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మెసేజ్ పంపేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా వినియోగంలో ఉన్నది. పై నగరాల్లో ఈ కొత్త విధానం రాకముందే మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు చేరవేసే విధానం అమల్లో ఉన్నది.

తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో సీసీటీవీల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి ఎస్ఎంఎస్ ద్వారా వాహనదారులకు చలాన్ వివరాలను అందించే విధానం అమలవుతున్నది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం దీన్నే వాడుతున్నారు. ఇక నుంచి దేశమంతా ఒకే లీగల్ సిస్టమ్ ఉండేలా ఈ-చలాన్ విధానాన్ని తెలంగాణ సైతం అమలు చేయనున్నది. దీంతో మొబైల్ ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు పంపే చలాన్ మెసేజ్ అధికారికం కానున్నది.

ఫిర్యాదు చేసే విధానం, పరిష్కార మోడ్:

• చలాన్​‌ను సవాల్ చేయాలనుకునే వాహనదారులు సంబంధిత ఆధారాలతో ఖచ్చితంగా పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి.
• ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సదరు అధికారి తగిన కారణాలతో కూడిన ఆర్డర్‌ను రాసి, నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయం లోపు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
• ఆర్డర్ కాపీని వాహన యజమానికి లేదా లైసెన్స్ హోల్డర్‌కు ఆన్‌లైన్ ద్వారానే పంపిస్తారు.

కొత్త ఈ-చలాన్ వ్యవస్థకు మార్పు

• ప్రస్తుతం వాడుకలో ఉన్న చలాన్ల విధానాన్ని మార్చి, కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన ‘సారథి – వాహన్’ ఈ-చలాన్ (E-Challan) సిస్టమ్‌లోకి మారాలని ప్రభుత్వం ఆదేశించింది.
• ఈ మార్పు కోసం పోలీస్, రవాణా శాఖలకు గరిష్టంగా ఆరు నెలల సమయం ఇచ్చింది.
• ఆరు నెలల తర్వాత పాత ఆన్‌లైన్ చలాన్ల వ్యవస్థ పూర్తిగా ఆగిపోతుంది. కేవలం ‘సారథి – వాహన్’ సిస్టమ్ ద్వారానే చలానాలు జారీ అవుతాయి.
• తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ను జూన్ 2న ప్రకటించడంతో వెంటనే అమల్లోకి వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>