భారత MMAకు టాలెంట్ ఉంది.. కానీ ఆదరణ కరువు!

కలం, స్పోర్ట్స్ : భారత్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)కు ప్రతిభావంతులైన ఫైటర్లు ఉన్నప్పటికీ.. వారికి తగిన ప్రోత్సాహం, ఆర్థిక భరోసా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం కొరవడిందని రోనిన్ FC (Ronin FC) సహ వ్యవస్థాపకుడు కేవీ చౌడప్ప తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సత్తా భారత ఫైటర్లకు ఉన్నప్పటికీ, స్పాన్సర్‌షిప్, మౌలిక వసతులు, అవకాశాల కొరత వారి కెరీర్‌కు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పారు. రోనిన్ FC మూడో ఎడిషన్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతిభ ఉన్నా.. ప్రొఫెషనల్ కెరీర్‌కు అడ్డంకులు

భారత ఫైటర్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని చౌడప్ప పేర్కొన్నారు. అయితే MMAను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకునే పరిస్థితులు ఇంకా పూర్తిగా ఏర్పడలేదన్నారు. కొందరు ఫైటర్లు MMAతో పాటు ఇతర ఉద్యోగాలు చేస్తూ పోటీలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. డెలివరీ ఉద్యోగాలు చేస్తూనే శిక్షణ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. ఒక ఫైట్ కోసం ఫైటర్లు శారీరకంగా, మానసికంగా ఎన్నో త్యాగాలు చేస్తున్నారని.. అయినా వారికి తగిన గుర్తింపు, ఆర్థిక ప్రయోజనం దక్కడం లేదన్నారు. MMAకు ప్రేక్షకుల ఆదరణ పెరగడం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రేక్షకులు పెరిగితే స్పాన్సర్లు కూడా ముందుకు వస్తారని, తద్వారా ఫైటర్లకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని వివరించారు.

ఒక్క ఫైట్‌కు రూ.1.7 లక్షల వరకు

ప్రొఫెషనల్ MMAలో ఎంట్రీ లెవల్ ఫైటర్ ఒక్కో ఫైట్‌కు సుమారు 2 వేల అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ.1.7 లక్షలు సంపాదించే అవకాశం ఉందని చౌడప్ప తెలిపారు. అమేచ్యూర్ ఫైటర్లకు కూడా రివార్డులు, పోటీ అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. భారత MMA ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడమే రోనిన్ FC లక్ష్యమన్నారు. మూడో ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 120 మంది అమేచ్యూర్ ఫైటర్లు పాల్గొన్నారని తెలిపారు. ఫైనలిస్టులకు ప్రొఫెషనల్ బౌట్లతో పాటు లైవ్ ఆడియన్స్ ముందు పోటీ చేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. రోనిన్ FC మూడో ఎడిషన్‌లో కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, నేపాల్‌కు చెందిన సుమారు ఆరుగురు అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఫైటర్లు పాల్గొన్నారు. అయితే వీసా, ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా మరికొందరు విదేశీ ఫైటర్లు ఈవెంట్‌కు హాజరు కాలేకపోయారని చౌడప్ప తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం ఉన్న భారత ఫైటర్లకు రోనిన్ FC స్పాన్సర్‌షిప్ అందించిందన్నారు. కొందరు ఫైటర్లకు భారత్‌తో పాటు అమెరికాలోనూ శిక్షణ ఇప్పించినట్లు వెల్లడించారు.

MMA అభివృద్ధికి మౌలిక వసతులు అవసరం

దేశవ్యాప్తంగా మరిన్ని జిమ్‌లు, క్లబ్‌లు ఏర్పడాల్సిన అవసరం ఉందని చౌడప్ప అన్నారు. MMAకు బలమైన ఏకీకృత వ్యవస్థ లేకపోవడం, ఈవెంట్ల నిర్వహణకు అవసరమైన అనుమతులు పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా క్రీడ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రోనిన్ FC సొంత కమ్యూనిటీ, కుటుంబ వనరుల నుంచి సమకూరే నిధులతో కొనసాగుతోందని చెప్పారు. తక్షణ లాభాల కంటే ముందుగా MMAకు అవసరమైన మౌలిక వసతులు, కమ్యూనిటీని నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కోటి మంది యువతే లక్ష్యం

భారత్‌కు ఉన్న సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ వారసత్వం ఆధునిక MMAకు బలమైన పునాదిగా మారగలదని చౌడప్ప అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కనీసం కోటి మంది యువతను MMA, కాంబాట్ స్పోర్ట్స్ పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో MMAను మరింత విస్తరించేందుకు రోనిన్ FC భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు. అయితే ఆ ప్రణాళిక పూర్తిగా సిద్ధమయ్యే వరకు దాని వివరాలను వెల్లడించబోమని చౌడప్ప తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>