కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా గంగాధర మండలం మంగంపేట గ్రామం బీసీ కాలనీకి చెందిన రైతు కూలీలు నేడు పత్తి చేనులో పనులకు ఆటోలో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగంపేట నుండి మల్కాపూర్ లో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా, గంగాధర – కరీంనగర్ రోడ్డులో ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద వెనుక నుండి వస్తున్న కోళ్ల వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగాల దేవమ్మ (55) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండి కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం (MLA Medipally Satyam) వెంటనే సివిల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే మృతురాలు లింగాల దేవమ్మ కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున పరిహారం అందించాలని సీఎంఓ కార్యాలయానికి ఫోన్ చేసి కోరారు. ఆయన వెంట మంగంపేట సర్పంచ్ లింగాల లింగయ్య, ఉప సర్పంచ్ నల్ల హనుమంతు, కాంగ్రెస్ నాయకులు బైరిశెట్టి సంపత్ తదితరులు ఉన్నారు.

