కలం, కరీంనగర్: గన్నేరువరం (Ganneruvaram) మండల కేంద్రంలో అధ్వానంగా తయారైన ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టి, నూతన రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, యువజన సంఘాలు తలపెట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షకు దిగేందుకు యత్నించిన పలువురు యువజన సంఘాల నాయకులను, గ్రామస్థులను ఆదివారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గత కొంతకాలంగా గుంతలమయంగా మారిన రోడ్డు వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బస్టాండ్ కూడలిలో ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.ఈ అరెస్టులతో గన్నేరువరంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు నిర్మాణం కోసం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

