ఉమ్మడి నల్గొండలో HIV కలకలం.. నెలకు 40కి పైగా కొత్త కేసులు

కలం, నల్లగొండ బ్యూరో : “పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?” అనే ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అత్యంత ప్రభావం చూపిన ప్రజారోగ్య అవగాహన ప్రకటనల్లో ఒకటి. రెండు దశాబ్దాల కింద ఈ ప్రకటన విస్తృతంగా ప్రసారమై, గ్రామీణ ప్రాంతాల వరకు హెచ్‌ఐవీపై చర్చకు దారితీసింది. ప్రస్తుత్తం ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో మళ్లీ ఎయిడ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతినెల సగటున 40కి పైగా HIV కొత్త పాజిటివ్ కేసులు (HIV Cases) నమోదువుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏఆర్‌టీ కేంద్రాల అధికారిక లెక్కల ప్రకారం నమోదైన కేసులే 16 వేలకుపైగా ఉన్నాయంటే , ఇందులో క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏఆర్‌టీ మందులు వాడేవారి సంఖ్య సగానికి పైగా ఉండడం కలవరానికి గురిచేస్తోంది. సమాజంలో పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఏఆర్‌టీ కేంద్రాలకు వెళ్లడంలేదు. మరి కొందరు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గోప్యంగా చికిత్స పొందుతుండగా, ఇంకొందరు పరీక్షలే చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.

నల్లగొండ జిల్లాలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి – 65ని ఆనుకుని ఉన్న ఒకే గ్రామంలో దాదాపు 300 మంది వరకు హెచ్‌ఐవీ లక్షణాలు, అనుమానాలు ఉన్నవారు ఉన్నట్లు సమాచారం. ఇందులో కేవలం 30 కేసులు మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. మిగిలిన వారంతా రహస్యంగా ఉంచడం తద్వారా తమ భాగస్వాములకు లేదా ఇతరులకు వ్యాధిని సంక్రమింపజేస్తుండడం కారణంగా వ్యాధి తీవ్రత పెరుగుతోంది.

అవగాహనా లోపమే కారణమా..

కళాశాల విద్యార్థుల్లోనూ ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే వయసు ప్రభావంతో వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో తమకేమీ కాలేదనే ధీమాతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గతంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెక్స్ వర్కర్లు, హైవే టోల్ ప్లాజాలు, లారీ డ్రైవర్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, కండోమ్ సరఫరా, పరీక్షలు నిర్వహించేవారు.

కొన్నాళ్లుగా అవగాహన కార్యక్రమాలు దాదాపు లేవు. ఇది కూడా కేసుల పెరుగుదల కారణంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ స్పందించి విద్యాసంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత లైంగిక విద్యపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో గోప్యంగా ఉచిత పరీక్షలు నిర్వహించి, బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ క్రమం తప్పకుండా మందులు అందేలా పర్యవేక్షించకపోతే ఉమ్మడి జిల్లా తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెరిగిన టెక్నాలజీ వాడకం ద్వారా..

ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత మారిన జీవనశైలి, విచ్చలవిడిగా స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిపోయింది. మరోవైపు మొబైల్ డేటా విరివిగా లభించడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌లో పరిమితులు లేని అడల్ట్ కంటెంట్ లభించడంతోనూ యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన లైంగిక అవగాహన, సురక్షిత పద్ధతులపై స్పష్టత లేకపోవడంతో 16 ఏళ్ల ప్రాయం నుంచే అసురక్షిత శారీరక సంబంధాలకు దారితీస్తోంది. ఒకప్పుడు హైవేలు, ఆర్టీసీ డిపోలు, నిర్దిష్ట కేంద్రాలకే పరిమితమైన ఎయిడ్స్, ఇప్పడు యువత నుంచి నలభై ఏళ్ల ప్రాయంలోని వారి వరకు పాకుతుండడం జిల్లా వాసులను, ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>