హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్ సంత‌కం ఫోర్జ‌రీ

కలం, క్రైమ్ బ్యూరో: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్వోసీలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు) సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ((HYDRAA Commissioner Ranganath)) సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలు రూపొందించినట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్వహించిన వార్షిక తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాల్లోని క్యూఆర్ కోడ్లు, ఫైల్ నంబర్లు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు.. హైడ్రా, అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించారు. సదరు పత్రాలు తమ శాఖల నుంచి జారీ కాలేదని, సంతకాలు సైతం ఫోర్జరీకి గురయ్యాయని నిర్ధారించారు. అనంతరం లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏఏ కాలేజీలంటే..?

ఈ వ్యవహారంలో మొత్తం 8 ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై కేసులు నమోదయ్యాయి. ఎస్సార్ నగర్‌లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజీతో పాటు మెహిదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్‌లోని మదర్స్ గర్ల్స్, చిక్కడపల్లిలోని న్యూ ఏరా, శివరాంపల్లిలోని షహిన్, తెల్లాపూర్‌లోని వశిష్ట, బర్క‌త్‌పురాలోని హైందవి కాలేజీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మేం తప్పు చేయలేదు: హైందవి

ఈ కేసుకు సంబంధించి హైందవి కాలేజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తమ కాలేజీ అన్ని అనుమతులు, పత్రాలను చట్టబద్ధమైన విధానంలోనే సమర్పించిందని తెలిపారు. తమ సంస్థ ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదని, ఎక్కడైనా అక్రమం జరిగి ఉంటే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసు అందిందని, దానికి అవసరమైన ఆధారాలతో సమాధానం ఇస్తామని చెప్పారు. అధికారుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.

బాధ్యత ఎవరిది?: ఆర్ఎస్ ప్రవీణ్

ఈ ఘటనపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖల పర్యవేక్షణలో జరుగుతున్న అవినీతి, ఫోర్జరీలను నియంత్రించడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>