కలం, నిజామాబాద్ బ్యూరో: భార్య, పోలీసులు చూస్తుండగానే ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చోటుచేసుకుంది. అంతటి బాధ కలగడానికి కారణం బెట్టింగ్ భూతం. ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) వలలో చిక్కుకొని ప్రాణాలు తీసుకున్నాడు. మోపాల్ మండలంలోని బాడ్సి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల దశరథ్ (35).. మెదక్ జిల్లా రామాయంపేట్ లోని ప్రైవేటు కెమికల్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ గా పని చేశాడు.
ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి రూ. 45 లక్షల వరకూ అప్పులు చేశాడు. వాటిని చాలావరకు తండ్రి చెల్లించాడు. అయితే బెట్టింగ్ నిర్వాహకుడు మిగతా డబ్బులు చెల్లించాలంటూ దశరథ్ కు కొన్ని రోజులుగా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దశరథ్.. కుటుంబ సభ్యులందరితో ఫోన్లో మాట్లాడాడు. ఎక్కడ ఉన్నావని అడగ్గా.. చెరువు కట్టపై ఉన్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించారు.
ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆచూకీ కనుగొని చెరువు కట్ట వద్దకు వెళ్తుండగా.. వీరి రాకను గమనించిన దశరథ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య కరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుహిత తెలిపారు.

