కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) ట్రైసిటీస్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఓ వైపు పోలీసులు నిఘా పెంచుతున్నామని చెబుతున్నప్పటికీ గంజాయి దాడులు ఆగడం లేదు. అర్ధరాత్రి దాటితే చాలు, గంజాయి మత్తులో తూగుతున్న యువత అమాయకులపై పడి విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారు. కొద్ది రోజుల కిందట వరంగల్ నగరంలో ఎల్బీనగర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తిపై జరిగిన దాడి నగరంలో సంచలనం రేపింది.
శివారు ప్రాంతాల్లో విక్రయాలు
వరంగల్ హనుమకొండ, కాజీపేటలోని శివారు ప్రాంతాలు ఇప్పుడు గంజాయి హబ్‌గా మారిపోతున్నాయి. విక్రయదారులు పట్టపగలే కాలేజీ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారు. ప్రధానంగా హంటర్ రోడ్, కాజీపేట రైల్వే స్టేషన్, కేయూ క్యాంపస్ పరిసరాలు, మట్టెవాడ, బట్టల బజార్, శాయంపేట చుట్టుపక్కల నిర్మానుష్య ప్రాంతాలు, పాత బిల్డింగ్‌లు అడ్డాలుగా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. 25 లోపు ఏళ్ల యువత, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ మత్తుకు బానిసలవుతున్నారు. రూ.100కే గంజాయి ప్యాకెట్ దొరుకుతుండండంతో ఈజీగా కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా కొనుగోలు చేసిన గంజాయిని సిగరెట్లుగా మార్చి సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
మత్తులో దాడులు, ఘర్షణలు
గంజాయి మత్తులో చిన్న పాటి కారణాలకే కత్తులు దూస్తున్నారు. వరంగల్‌లో గత 4 నెలల్లో గంజాయి మత్తులో 8 హత్యలు, 20కి పైగా దాడులు జరిగినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఎల్బీనగర్‌కు చెందిన సురేష్ రాత్రి సమయంలో పని నిమిత్తం గాంధీనగర్‌కు వెళ్లాడు. అక్కడ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు సురేష్‌ను అడ్డగించి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన సురేష్ నిస్సహాయ స్థితిలో అక్కడే పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం పారిశుధ్య కార్మికులు అతడిని గుర్తించి క్షేమంగా ఇంటికి చేర్చారు. చెడు వ్యసనాలకు బానిసలైన యువత కాలేజీకి వెళ్లడం మానేసి సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో దొంగతనాలు చేస్తున్నారు. ఆ విధంగా వచ్చిన డబ్బుతో గంజాయి కొనుగోలు చేసి ఆ మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాల సంచారం ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో పాన్ షాపులు, మద్యం దుకాణాల వద్ద ఈ బ్యాచ్‌లు తిష్ట వేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం మత్తులో ఉన్న నలుగురు యువకులు టిఫిన్ సెంటర్ పై దాడి చేశారు. మరుసటి రోజు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ వైఫల్యం
గంజాయి ముఠాల ఆగడాల నియంత్రణలో పోలీసులు విఫలమాయ్యారనే విమర్శలు లేకపోలేదు. ప్రతి వారం దాడులు చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం. కానీ ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి సరఫరా ఆగకపోవడంతో పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం” అని పోలీస్ అధికారులు పేర్కొంతున్నట్లు సమాచారం. మూడు నెలల కిందట వరంగల్ టాస్క్‌ఫోర్స్ టీం 200 కేజీల గంజాయిని పట్టుకుంది. రవాణా చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసింది. అయినప్పటికీ గంజాయి రవాణా, విక్రయాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్రమార్కులు కొత్త కొత్త పద్ధతుల్లో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం స్కూల్స్, కాలేజీల దగ్గర ఆపరేషన్ పరివర్తన పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గంజాయి డ్రగ్స్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. జైలు జీవితం, పోలీస్ కేసులతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు.
కట్టడి చేయాల్సిందే?
గంజాయి, మత్తు పదార్దాల రవాణా, విక్రయాల పై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోకపోతే వరంగల్ నగరం మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళల్లో పాట్రోలింగ్ పెంచాలని, గంజాయి విక్రయ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

