కలం, వెబ్ డెస్క్ : ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు . రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.
నితిన్ నబీన్ పర్యటనలో భాగంగా సోమవారం విశాఖపట్నానికి చేరుకుని మంగళవారం సింహాచలం అప్పన్నను దర్శించుకుంటారు. అనంతరం నబీన్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి బీజేపీ కార్యవర్గ భేటి జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ ఇన్ఛార్జ్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, సంస్థాగతంగా ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచేలా కార్యక్రమాలు చేపట్టడం, ఎన్నికలకు సమర్థవంతంగా సిద్ధం కావడంపై నేతలకు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీలో బీజేపీ రాజకీయంగా మరింత బలపడేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

