కలం, కరీంనగర్ బ్యూరో: ఎల్ నినో ప్రభావం రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)పై కూడా తీవ్రంగానే చూపుతోంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. బావుల ద్వారా సాగు నీరు అందే చోట మాత్రమే వరి నాట్లు వేశారు. మిగతా ప్రాంతాల్లో పనులు జరగకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. కొనుగోళ్లు లేక, కేంద్ర సబ్సిడీ రాక ప్లాంట్ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరోవైపు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లోనూ మరో లక్ష టన్నుల నిల్వలు పేరుకుపోయాయని తెలిసింది.
మార్క్ ఫెడ్ గోడౌన్లలో 1.50 లక్షల టన్నులు
తెలంగాణలో కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లా రామగుండంలోని ఏకైక యూరియా ప్లాంట్ అయిన RFCL నుంచి ఎరువుల ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఖరీఫ్ అవసరాల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో 65 వేల టన్నుల చొప్పున, జూన్లో 55 వేల టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. జులై నెలలో 45 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా, ఇటీవల ప్లాంట్లో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల ఈ నెలలో ఇప్పటివరకు 10 వేల టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఇంకా మిగిలిన 11 రోజుల్లో నిర్దేశిత ఉత్పత్తిని సాధించేందుకు మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా RFCLకు చెందిన సుమారు 2.50 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా… ఇప్పటివరకు కేవలం లక్ష టన్నుల యూరియాను మాత్రమే రైతులు కొనుగోలు చేశారు.

