లగ్జరీకి గుడ్‌బై.. పల్లెబాటలో ‘రివర్స్ వెకేషన్’!

కలం, వెబ్ డెస్క్: రాజు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్, రూ.లక్షల్లో జీతం. భార్య, ఇద్దరు పిల్లలతో హైటెక్ సిటీలోని డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివాసం. అవసరమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. అయినా జీవితంలో ఏదో వెలితి.. పని ఒత్తిడితో చికాకు. కొంచెం రిలీఫ్ కోసం వెకేషన్ వెళ్లాలని అనుకున్నాడు. దేశవిదేశాల్లోని టూరిస్ట్ ప్లేస్‌ల గురించి సెర్చ్‌ చేశాడు. చివరికి భుజాన బ్యాగ్ వేసుకొని ఓ మారుమూల పల్లెటూరుకు వెళ్లిపోయాడు. ఓ వారం అక్కడ ఉన్నాక జీవితమంటే ఏంటో అర్థమైంది. అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంకా అసంతృప్తి ఎందుకని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఉన్నదాంట్లో సంతృప్తిగా బతకడం ఎలాగో నేర్చుకున్నాడు. మైండ్‌ను రీసెట్‌ చేసుకొని రీఫ్రెష్‌గా హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.

ఇలా రాజు ఒక్కడే కాదు.. ఎంతోమంది తమ మూలాలను వెతుక్కుంటూ వెళ్తున్నారు. లగ్జరీ టూరిస్ట్ ప్లేసులను కాదని పల్లెల బాట పడుతున్నారు. అక్కడి అరకొర సౌకర్యాల్లో కొన్ని రోజులు ఉండి, ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు. తమను తాము కొత్తగా ఆవిష్కరించుకొని తిరిగి ప్రయాణమవుతున్నారు. ఇప్పుడు ట్రావెల్‌ రంగంలో ఇదొక ట్రెండ్‌గా మారింది. దీన్ని ‘రివర్స్ వెకేషన్’ అని పిలుస్తున్నారు.

కొన్నాళ్లుగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ‘రివర్స్ వెకేషన్’ (Reverse Vacation) ట్రెండింగ్‌గా మారింది. సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోని వాళ్లు ఫైవ్ స్టార్ హోటల్స్, స్విమ్మింగ్ పూల్స్, లగ్జరీ రిసార్ట్‌లలో హాయిగా గడపాలని అనుకుంటారు. ఎప్పుడూ చూడని హైఫై ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ, ఇప్పుడు అది మారింది. ఆ హైఫై ప్రాంతాల కంటే.. మూలాల్లోకి వెళ్లి రావాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. తాము లేదా తమ పూర్వీకులు పుట్టిపెరిగిన పల్లెలకు వెళ్లి ఒకటీ రెండు రోజులు ఉండివస్తున్నారు. కార్లను వదిలి.. కాలినడకన గ్రామాల్లో తిరుగుతున్నారు. కొందరైతే నెలలో 10 రోజులు పల్లెల్లోనే గడుపుతున్నారు. పాత ప్రాంతాల్లో, పాత దోస్తులతో చక్కర్లు కొడుతున్నారు. ఒత్తిడి నుంచి ప్రశాంతతన, ఉత్సాహాన్ని వెతుక్కుంటున్నారు.

సాధారణంగా సెలవులు అంటే విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, రుచికరమైన ఆహారం, అన్ని సౌకర్యాలు ఉండే ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటాం. కానీ, ‘రివర్స్ వెకేషన్’ దానికి పూర్తిగా భిన్నం. దీని ప్రకారం.. ట్రావెల్ ట్రిప్ మీ సాధారణ జీవితం కంటే మరింత విలాసవంతంగా ఉండకూడదు. మీరు రోజువారీ అనుభవించే సౌకర్యాల కంటే తక్కువగా ఉండాలి. అంటే మీకు రోజు అందుబాటులో ఉండే సౌకర్యాలేవీ.. మీరు వెళ్లే చోట ఉండకూడదు. మీ ఇంట్లో కంటే తక్కువ సౌకర్యాలు ఉండే చోటుకు వెళ్లాలి. ఒకవేళ మీరు మెట్రో సిటీల్లో ఉంటే పట్టణాలకు వెళ్లాలి. పట్టణాల్లో ఉంటే పల్లెలకు వెళ్లాలి. అక్కడ 10 నిమిషాల్లో అన్నీ వచ్చే క్విక్ డెలివరీ యాప్‌లు ఉండొద్దు. లాండ్రీ సర్వీస్, మెరుగైన బాత్‌రూమ్ సదుపాయాలు, ఆధునిక విలాసాలు లేని సాధారణ హోమ్‌స్టేలు లేదా చిన్న కొండ ప్రాంతాల్లోని ఇళ్లలో గడపాలి.

దీని ఉద్దేశం ఏంటి?

సాధారణ సౌకర్యాలకు అలవాటుపడి, జీవితంలో బోర్ కొడుతున్న వారికి లేదా లక్ష్యాలను కోల్పోయినట్లు అనిపించే వారికి ఈ రకమైన ప్రయాణం ఒక ‘మైండ్ రీసెట్’లా పనిచేస్తుందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు.

కంఫర్ట్ జోన్ దాటడం: కొన్ని రోజుల పాటు డిజిటల్ సేవలు, విలాసాలకు దూరంగా ఉండటం వల్ల జీవితంపై కొత్త దృక్పథం ఏర్పడుతుంది.
విలువ తెలుస్తుంది: మారుమూల ప్రదేశాల్లో ఇబ్బందులు పడి ఇంటికి తిరిగొచ్చాక… మనకు లభిస్తున్న మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాల విలువ ఏంటో బాగా అర్థమవుతుంది.
మానసిక ప్రశాంతత: ఎలాంటి డిజిటల్ హడావుడి, ఆఫీస్ కాల్స్ లేని వాతావరణం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సరికొత్త అనుభూతి కోసం, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగడపడుతుంది.

ఆత్మపరిశీలనకు అవకాశం – డాక్టర్ ఆశా, సైకియాట్రిస్ట్, స్పార్ష్ హాస్పిటల్, బెంగళూర్

కొన్ని రోజులు నిరాడంబరమైన జీవితాన్ని గడపడం ద్వారా మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మనం రోజూ అనుభవించే సౌకర్యాలకు దూరంగా ఉండడం వల్ల.. మార్పును అంగీకరించడం, సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడం, ఆధునిక వసతులపై మనం ఎంతగా ఆధారపడుతున్నామో గ్రహించడం సాధ్యమవుతుంది. ఇలాంటి అనుభవం మనుషుల్లో కృతజ్ఞతా భావాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. దీన్ని ఒక శిక్షగానో లేదా వేరొకరితో పోటీగానో భావించకుండా… ఆత్మపరిశీలనకు లభించిన ఒక అవకాశంగా భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>