కలం, వరంగల్ బ్యూరో : కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులరైజేషన్ (Lecturer Regularisation) అనేది ఏళ్ల తరబడి సేవలందించినందుకు భరోసాగా ఇవ్వాల్సిన ప్రక్రియ. కానీ, బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు తూట్లు పొడిచారనే ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ విద్యాశాఖలో అర్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాకముందే కొందరికి గెజిటెడ్ హోదా కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు 750 మందికిపైగా అనర్హులకు రెగ్యులరైజేషన్ చేశారనే ఆరోపణలు, మరోవైపు ఏళ్లుగా విధుల్లోని 411 మంది ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘శాంక్షన్ పోస్టులు లేవు’ అంటూ క్రమబద్ధీకరణను నిలిపివేయడం.. ఇంటర్ విద్యాశాఖలో జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లో ‘చక్రం’తిప్పిన మంత్రి
2023లో డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంటర్ విద్యలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులరైజేషన్ చేపట్టారు. ఈ ప్రక్రియలో అప్పటి ప్రభుత్వంలోని కీలక మంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సదరు మంత్రి పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేశారనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు. తనకు అనుకూలంగా ఉన్నవారికి రెగ్యులరైజేషన్ చేసేందుకు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో ‘ మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. మేము చూసుకుంటాం’ అంటూ రూల్స్ పక్కన పెట్టించారనే విమర్శలు ఉన్నాయి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎక్కడ?
క్రమబద్ధీకరణ ప్రక్రియలో అభ్యర్థుల విద్యార్హతలు, సర్టిఫికెట్ల జెన్యూనిటీని పూర్తిస్థాయిలో చెక్ చేయకుండానే జాబ్ లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో పీజీలు చేసిన సుమారు 380 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల వివరాలను పరిశీలించగా, ఇందులో 167 మంది విద్యార్హతల సమాచారం సంబంధిత యూనివర్సిటీల్లో లేదనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇలాంటి సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు పరిశీలించారు? ఎవరి సిఫారసులతో ఆమోదించారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
37 మందిపై చర్యలకు కసరత్తు
ఇంటర్ విద్యలో రెగ్యులరైజేషన్ పొంది అర్హతలు, సర్టిఫికెట్లలో అనుమానాలు ఉన్న 37 మందిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం వారికే పరిమితమా? లేక మరింత విస్తృతంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖలోని ఓ కింది స్థాయి అధికారి కొందరు అనర్హుల నుంచి లబ్ధి పొంది సుమారు 56 మందికి గెజిటెడ్ ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
రెగ్యులరైజేషన్ పొందిన వారిలో కొందరు ప్రస్తుతం ఇన్చార్జి ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా కోర్టులో వివాదం కొనసాగుతున్నప్పటికీ వారికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు నిజమైతే.. ఇంతకాలం వాటిని గుర్తించకుండా వ్యవస్థలు ఏం చేశాయి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.
సర్కార్ ముందున్న సవాల్
రెగ్యులరైజేషన్ అయిన ప్రతి ఒక్కరి విద్యార్హతలు, సర్టిఫికెట్ల జెన్యూనిటీ, నియామక అర్హతలను స్వతంత్రంగా పరిశీలించాలి. అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అర్హత ఉన్న మరో 411 మంది ఒకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. రెగ్యులరైజేషన్ ఫైళ్లన్నింటినీ బయటకు తీసి సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫై చేయాలని కోరుతున్నారు.
411 కుటుంబాలకు ‘శాంక్షన్ పోస్టుల’ శాపం తగిలింది. ఇంటర్ ఒకేషనల్ విద్యలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు ఉన్నప్పటికీ సుమారు 411 మందికి శాంక్షన్ పోస్టులు లేవనే కారణంతో రెగ్యులరైజేషన్‌కు దూరం పెట్టారని చెబుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహించిన తమకు ఒక న్యాయం.. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మరో న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.

