కలం డెస్క్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతి ఏటా దావోస్(Davos WEF)లో నిర్వహించే ఎకనమిక్ సమ్మిట్ (Economic Summit) వచ్చే నెల 19-23 తేదీల మధ్య జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు (Sridhar Babu), ఆ శాఖ అధికారులు, సీఎంఓ ఆఫీసర్లు నాలుగైదు రోజుల పర్యటనకు వెళ్ళనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) సందర్భంగా విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ (Vision Document) పెట్టుబడుల ఆకర్షణకు కీలకం కానున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి వెళ్తున్న సీఎం రేవంత్.. గతంకంటే ఎక్కువ పెట్టుబడులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు లక్షల కోట్లు దాటిన ఇన్వెస్ట్ మెంట్స్ :
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల లోపే ఫస్ట్ టైమ్ దావోస్ వెళ్ళిన సీఎం రేవంత్.. రూ. 40 వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు (MoU) కుదుర్చుకున్నారు. గతేడాది జనవరిలో సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రెండుసార్లు కుదుర్చుకున్న ఒప్పందాల్లో సగటున 94% గ్రౌండింగ్ అయినట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గతంలోనే ఒక ప్రకటనలో తెలిపారు. తొలిసారి (2024)లో మొత్తం 14 ఎంఓయూల ద్వారా 18 ప్రాజెక్టులకు అవగాహన కుదిరిందని, ఇందులో 17 ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. దావోస్(Davos WEF)లో 2025లో కుదిరిన 40 ఒప్పందాల ద్వారా రూ. 1.79 లక్షల కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైందన్న మంత్రి వివరాలను వెల్లడించలేదు.
విజన్ డాక్యుమెంట్‌తో ఎక్కువ పెట్టుబడులు :
గతం పర్యటన సందర్భంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో వివిధ దేశ, విదేశీ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈసారి విజన్ డాక్యుమెంట్ స్లోగన్‌తో ఇన్వెస్టుమెంట్ల కోసం ప్రయత్నించనున్నారు. ఫ్యూచర్ సిటీ (Future City)లో ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ర. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీటికి అదనంగా దావోస్ సమ్మిట్‌లో ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్లు, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ తదితర రంగాలపై విదేశీ కంపెనీలు ఆసక్తి ఎక్కువగా చూపుతున్నందున హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను రాష్ట్ర ప్రతినిధులు వివరించే అవకాశమున్నది. సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగానే ఆకర్షణ ఉన్న దృష్ట్యా హైదరాబాద్‌ను ఎంచుకునేలా ఆ రంగ పారిశ్రామికవేత్తలను కన్విన్స్ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు తెప్పించుకోవడం రాష్ట్ర సర్కారుకు కీలకంగ మారనున్నది.
Read Also: సత్యవతి రాథోడ్ పై సీతక్క షాకింగ్ కామెంట్స్
Follow Us On: Instagram


