కలం, వెబ్ డెస్క్: జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వీలినం కాబోతున్నాయా? ఆ రెండు పార్టీలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నాయా? ‘అఖండ కాంగ్రెస్’ అవతరించబోతున్నాదా?.. దేశ రాజకీయాల్లో ఇప్పుడీ ప్రచారం జోరుగా సాగుతున్నది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ–ఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌లో కలవనున్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది.
నానాపటోలే సంచలన వ్యాఖ్యలు..
టీఎంసీ, ఎన్సీపీ–ఎస్పీ విలీనంపై కాంగ్రెస్ లీడర్ నానాపటోలే శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సారూప్య సిద్ధాంతాలు కలిగిన పార్టీలు కాంగ్రెస్‌లో (Congress Party) విలీనం కావడానికి సిద్ధమవుతున్నాయి. శరద్ పవార్, మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో కలవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది పొత్తు కాదు.. పార్టీల విలీనమే” అని ఆయన స్పష్టం చేశారు. శరద్ పవార్ గతంలోనే విలీన ప్రతిపాదన తెచ్చారని, కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమైందని తెలిపారు. దేశంలో ఓట్ల చీలికను అరికట్టడానికి.. భావసారూప్య పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
మరికొందరు నేతలు సైతం..
శివసేన (యూబీటీ) లీడర్ సంజయ్ రౌత్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ గెహ్లాట్ కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేతలతో ఏర్పడిన చిన్న పార్టీలను మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి శరద్ పవార్ చొరవ తీసుకోవాలని సంజయ్ రౌత్ కోరారు. ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనమై, రాహుల్ గాంధీని తమ నాయకుడిగా అంగీకరించాలని అశోక్ గెహ్లాట్ కోరారు. ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకుడనే స్పష్టమైన సందేశం వెళ్తే, దేశంలో ఓటింగ్ సరళి పూర్తిగా మారుతుందని అన్నారు.
టీఎంసీలో సంక్షోభం..
ప్రస్తుతం టీఎంసీ (TMC) తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు తిరుగుబాటు చేశారు. పార్టీ తన చేతుల్లోంచి జారిపోకుండా చూసుకునేందుకు మమత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే కాంగ్రెస్‌లో టీఎంసీని విలీనం చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.
Read Also: మీనాక్షి కోసం త్యాగం చేసే ఆ ‘ఒక్కరు’ ఎవరు?
Follow Us On: Instagram

