కలం, తెలంగాణ బ్యూరో : శుక్రాచార్యుడు ఫామ్ హౌజ్‌కు వెళ్ళిపోతే మారీచుడు, సుబాహుడి రూపంలో బావ బామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ అసెంబ్లీ లోపలకి వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఫైర్ అయ్యారు. ఆనాడు మాయలేడి రూపంలో కుట్రలు, కుతంత్రాలు జరిగితే ఇప్పుడు సోషల్ మీడియా రూపంలో అసత్య ప్రచారాలు వస్తున్నాయన్నారు. రాస్తున్న రాతలు, చూపిస్తున్న దృశ్యాలు శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడికి ఉపయోగపడేలా ఉంటున్నాయన్నారు. ప్రజలకు మేలు జరిగేందుకు పురాణాల్లో దేవతలు యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే వాటిని భగ్నం చేయాలని బకాసురుడు, మారీచుడు, రావణాసురుడు లాంటి బ్రహ్మ రాక్షసులకు కులగురువుగా ఉన్న శుక్రాచార్యుడు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేలా తాము ప్రయత్నిస్తూ ఉంటే వాటికి అడ్డం పడేలా ఈ ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.
దోపిడీదారులకు గురువు కేసీఆర్ :
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేక ఒకపక్కన శుక్రాచార్యుడు.. మరోవైపు మారీచుడు, సుబాహుడు బయలుదేరారని కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లపై (KTR) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంలో ఈ పాత్రల గురించి తనకన్నా ప్రజలకే ఎక్కువగా తెలుసన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే భూ బకాసురులు, కబ్జాదారులకు, ఆక్రమణదారులకు కులగురువు ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో ఉన్నాడని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. శకుని మామ తరహాలో అక్కడ ఉండి ఆయన పన్నాగాలు పన్నుతూ ఉన్నారని ఆరోపించారు. ధుర్యోధన వంశాన్ని వెంటబెట్టుకుని ఏదో ఒక రకంగా కుట్రలు, కుతంత్రాలతో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నారన్నారు. మారీచుడు మాయ జింక రూపంలో సీతను అపహరించుకెళ్ళడానికి రావణాసురుడికి సహకరిస్తే చివరకు ఆయన రాముడి చేతుల్లో హతమయ్యాడని గుర్తుచేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బట్ట కాల్చి మీదేయాలని అడ్డగోలు ప్రచారాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయని, ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నాయని అన్నారు. ఇవన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు లాంటి కుట్రదారులకు బలపడేలా దోహదం చేస్తున్నాయన్నారు.
Read Also: మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
Follow Us On: X(Twitter)


