ఖమ్మంపై కాంగ్రెస్ ‘సంక్షేమ’ శంఖారావం.. రైతు ఆశీర్వాద సభ సక్సెస్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం ( Khammam) జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం వేదికగా నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ రెండు లక్షల మందితో సూపర్ సక్సెస్ అయ్యింది. మధిర గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి అడుగుపెట్టగా, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సత్తా చాటారు. కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ మహాసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు నేటికీ ‘ఆధునిక దేవాలయాలుగా’ విరాజిల్లుతుంటే, బీఆర్ఎస్ రూ. 1.40 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కనీసం 10 టీఎంసీల నీటిని కూడా మోయలేక ‘కూలేశ్వరం’గా మారిందన్నారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ​ఇదే వేదికపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ‘భూభారతి’ కార్యక్రమం ద్వారా సరికొత్త భూ విప్లవానికి శ్రీకారం చుట్టామని, రాబోయే రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’ కార్డును అందజేస్తామని ప్రకటించారు. ముల్గుమాడ్ పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్ధం చేసిన భూదార్ కార్డులను సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. అలాగే ఇప్పటికే 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 20 వేల నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ. 63 వేల కోట్లు అందించడంతోపాటు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

​అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 30 నెలల్లో రూ. 36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, మొత్తంగా రైతాంగం కోసం రూ. 1.60 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు. ఈ బహిరంగ సభలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>