కలం, వెబ్ డెస్క్ : భారత్‌లో రెండేళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Former Bangladesh PM Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ్ దివస్ (విక్టరీ డే) సందర్భంగా దేశానికి తిరిగి చేరుకుంటానని ఆమె వెల్లడించినట్లు సమాచారం.
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హసీనా భారత్‌కు వచ్చారు. ఇప్పుడు తిరిగి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి తనను తీసుకెళ్లే విమానాన్ని పంపించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. తాను గతంలో విమానంలో భారత్‌కు వచ్చినందున, బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని పంపించాలని ఆమె విజ్ఞప్తి చేసినట్లు సహాయక వర్గాలు పేర్కొన్నాయి.
రాజ్యాంగ విరుద్ధంగా తనను అధికారం నుంచి తొలగించిన నేపథ్యంలో, విజయ్ దివస్ రోజున గౌరవప్రదంగా స్వదేశానికి చేరుకునేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని హసీనా సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
అయితే, హసీనా తిరుగు ప్రయాణంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఆమె స్వదేశానికి వస్తే అరెస్టు చేస్తామని ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమెను తీసుకెళ్లేందుకు విమానం పంపే అంశంపై భారత్‌తో అధికారిక చర్చలు జరగలేదని కూడా పేర్కొన్నాయి. దీంతో హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ నెలకొంది.

