కలం, నిర్మల్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలందరూ సమన్వయంతో, సమిష్టిగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సూచించారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశమై పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసాన్ని మరింత పెంపొందించడం, నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ నాయకులందరూ సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. పదవులు ఆశిస్తున్న నాయకుల పేర్లతో జాబితాను నేతలందరూ ఏకాభిప్రాయంతో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు అవకాశాలు కల్పించే విషయంలో సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తిస్తుందని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.

