కలం, సూర్యాపేట: రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 2,160 ఇందిరమ్మ ఇళ్లను ఒకే చోట నిర్మిస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద పదెకరాల్లో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల మోడల్ కాలనీని సందర్శించారు. రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, డ్రైన్స్ , వీధి లైట్లు, పిల్లల ఆట స్థలం, షాపింగ్ కాంప్లెక్స్, ఆర్చీలకు శంకుస్థాపనలు చేశారు.
ఇళ్ల పనులు నిలిపేశారు..
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ నియోజకవర్గంలో నిరుపేదలకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో పదెకరాల దేవాలయ భూములను మార్కెట్ రేటుకి కొనుగోలు చేసి పనులు ప్రారంభించామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసిందన్నారు.
తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి పనులను ప్రారంభించామన్నారు. రూ.75 కోట్లతో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలకు నిధుల మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
వారికి ఇంకో ప్లాట్..
ఈ ఇందిరమ్మ ఇళ్ల సముదాయంలో 2,500 మంది హౌసింగ్ కాలనీ, హుజూర్నగర్ లోకల్ పేద విద్యార్థులు చదువుకోడానికి వీలుంటుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాభ్యాసం ఉంటుందన్నారు. కాలనీలో ఇంకా గ్రీనరీ పెంచాలని, జిల్లాలోని హౌసింగ్ సిబ్బందితో ప్రతి ప్లాటు క్షుణ్ణంగా చెక్ చేసి, అన్ని పనులు పూర్తి అయినవో, పెండింగ్ ఉన్నాయో నివేదిక అందించాలని కలెక్టర్‌కు సూచించారు.
ఒకే ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఇద్దరు పిల్లలు ఉంటే వారికి అదనంగా ఇంకో ప్లాటు మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. టాయ్‌లెట్ రూమ్స్ చిన్నగా ఉన్నందున అతిథులు వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.
వేసవిలోగా కాళేశ్వరం మరమ్మతులు పూర్తి..
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనలు, క్వాలిటీ కంట్రోల్ నిపుణుల సూచనల మేరకు వచ్చే వేసవి కాలంలోపు మరమ్మతులు చేస్తామన్నారు. అనంతరం డ్యాం నింపి నీరు అందిస్తామన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, పెరిక కార్పొరేషన్ ఛైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాధికా, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, డీఎస్ఓ మోహన్ బాబు, హార్టికల్చర్ అధికారి నాగయ్య, వైస్ ఛైర్మన్ తన్నీరు మల్లికార్జున్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

