epaper
Tuesday, November 18, 2025
epaper

బీఆర్ఎస్ .. బీజేపీకి తాకట్టు : సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్ చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో క్రైస్తవ సంఘాలకు చెందిన ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పారు. క్రైస్తవ సంఘాలతో చర్చించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనార్టీల సమస్యలను రాహుల్‌ గాంధీ పరిష్కరించడానికి ప్రయత్నించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మైనార్టీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. “భారత రాష్ట్ర సమితిని కేసీఆర్‌ బీజేపీకి తాకట్టుపెట్టారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించినా మూడు నెలలు గడిచినా స్పందన రాలేదు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌కు గవర్నర్‌ అనుమతించలేదు. బీజేపీ, గులాబీ పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ఎందుకు అనుమతించలేదు? బీజేపీలో ఆ పార్టీ విలీనం అయ్యే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

సమావేశంలో మైనార్టీ సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రత, విద్య, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమైన సూచనలు చేసారు. సీఎం రేవంత్‌రెడ్డి వీటికి సానుకూలంగా స్పందించి, సమస్యలు త్వరగా పరిష్కరించే చర్యలు తీసుకునేలా హామీ ఇచ్చారు.

బీజేపీపై విమర్శలు

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరసగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ జరగకపోవడం వంటి అంశాల ఆధారంగా ఆయన బీజేపీని విమర్శిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని.. ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పారు. అయితే గతంలోనూ ముఖ్యమంత్రి ఇదే తరహాలో ఆరోపణలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలోనూ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వార్తలు వచ్చాయి. అంతేకాక బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేందుకు చర్చలు జరిగాయని కవిత వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్‌ను వీడిన గువ్వల బాలరాజ్ ఇదే తరహాలో మాట్లాడటం గమనార్హం. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. మరి ఈ అంశం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతుంది? ఎన్ని ఓట్లను రాలుస్తుంది? అన్నది వేచి చూడాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపొందేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కులసంఘాలు, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వంటి వారితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. మరి ఇక్కడి ఓటర్ల మదిలో ఏముందో వేచి చూడాలి.

Read Also: లేడీస్ హాస్టల్‌లో స్పై కెమెరాలు.. రోడ్డెక్కిన 2 వేల మంది మహిళలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>