కలం, వెబ్ డెస్క్ : నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు , అలాగే ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రం తరపున ఆయన ఆత్మీయ స్వాగతం పలికారు.
ఇటీవల యావత్ ప్రపంచం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందని, గాంధీజీ వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ న్యాయాన్ని కేవలం ఒక వృత్తిగా చూడకుండా పేదలు, బలహీనుల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని, ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల సమాజంలో ఏ ఒక్కరికీ న్యాయం దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.
పిల్లల సైబర్ భద్రతపై ఆందోళన
ఈ సదస్సులో “పిల్లల సైబర్ భద్రత” అనే అత్యంత కీలకమైన , సమకాలీన అంశాన్ని ఎంచుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ కు , NALSA బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ప్రపంచంలో గడుపుతున్నారని, అయితే పిల్లలు అంతర్జాలంలో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ , టెక్నాలజీ మన జీవితాలను ఎంతగానో సులభతరం చేసినప్పటికీ, అమాయకులైన పిల్లలు డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాలను, నిజానిజాలను వెంటనే గుర్తించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటర్నెట్ కొత్తగా నేరాలను సృష్టించకపోయినా, నేరాలు చేసే మార్గాలను ప్రపంచవ్యాప్తంగా మరింత సులభతరం చేసిందని, పిల్లలు తెలియక చేసే చిన్న పొరపాట్లు వారి కుటుంబాలపై , అలాగే మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖ, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు మరియు న్యాయ సేవా సంస్థలు వంటి బలమైన వ్యవస్థలు ఉన్నాయని, ఇవన్నీ సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే పిల్లలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించగలమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, ఉచిత న్యాయ సహాయం మరియు కౌన్సెలింగ్ అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, దేశంలోనే తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో సైబర్ అవగాహన కోసం CybHER యాప్‌ను వినియోగిస్తున్నామని, విద్యార్థులనే ‘సైబర్ అంబాసిడర్లు’గా తీర్చిదిద్ది తోటి విద్యార్థుల్లో చైతన్యం తెస్తున్నామని పేర్కొన్నారు.
అదే నిజమైన న్యాయం..
బాధిత పిల్లలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని, ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. TGS-LSA , పాఠశాల విద్యాశాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. న్యాయం అంటే కేవలం నేరస్థుడికి శిక్ష పడటం మాత్రమే కాదని, బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టి, అతనికి సమాజంలో పోగొట్టుకున్న గౌరవాన్ని ఇవ్వడమేనని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక చిన్నారి కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయమని అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ కీలక ఆదేశం
ఈ సదస్సు వేదికగా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాన్ని జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు , టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏ (TGS-LSA)లతో సంప్రదించి, పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఒక సమగ్రమైన ‘చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’ ను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. న్యాయ సేవా సంస్థలు చేపడుతున్న సంక్షేమ, అవగాహన కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇక పిల్లల సైబర్ భద్రతపై జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని, పిల్లలను మందలించేలా కాకుండా ఆసక్తితో, ప్రేమతో, అవగాహనతో వారి డిజిటల్ అలవాట్ల గురించి మాట్లాడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల ఫిర్యాదు కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను గుర్తుంచుకోవాలని కోరారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, అందించే సిఫారసులు తెలంగాణకే కాకుండా యావత్ దేశానికి సైబర్ భద్రత విషయంలో మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

