కలం, పాల్వంచ: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారి ఆటకట్టించేందుకు పాల్వంచ రూరల్ పోలీసులు (Palvancha Police) వేసిన పక్కా స్కెచ్ ఫలించింది. ముందస్తు సమాచారంతో మాటువేసిన పోలీసులు, ముర్రేడు వాగు (Murredu) నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న (Illegal Sand Transportation) ఒక ట్రాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ముర్రేడు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీసులు పక్కా ప్రణాళికతో సంగం గ్రామ శివారులో మాటువేసి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఇసుక లోడుతో వస్తున్న నీలం రంగు ఐషర్ (EICHER 480) ట్రాక్టర్‌ను అడ్డుకుని తనిఖీ చేయగా, ఇసుక తరలింపునకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేవని తేలింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న తమ్మల్ల వెంకట దుర్గాప్రసాద్ (30)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తన తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ట్రాక్టర్‌తో, దంతలబోర గ్రామ శివారులోని ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుకను నింపుకుని పాల్వంచ ప్రాంతంలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.
దీంతో పంచుల సమక్షంలో సుమారు రూ. 4 వేల విలువైన ఇసుక లోడుతో ఉన్న నీలం రంగు ట్రాక్టర్, ఎరుపు రంగు ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరిపినా, అక్రమంగా రవాణా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, సహజ వనరుల దోపిడీని అరికట్టేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పాల్వంచ రూరల్ పోలీసులు స్పష్టం చేశారు.

