కలం, స్పోర్ట్స్ : ధర్మశాలలో జరిగిన మ్యాచ్ (RCB vs GT) లో వార్ వన్‌సైడ్ అయిపోయింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్‌సీబీ బౌలింగ్‌లో కూడా తమ సత్తా చాటింది. గుజరాత్ బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించారు బెంగళూరు బౌలర్లు. గుజరాత్ బ్యాటర్లలో తవాటియా ఒంటరి పోరాటం చేశాడు. ముగ్గురు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు బ్యాటర్లు వీరవిహారం చేస్తే గుజరాత్ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగితే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం మైదానంలోకి వచ్చినంత సేపు కూడా నిలవలేదు. 2 పరుగులకే వెనుదిరిగాడు గిల్. దీంతో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. గుజరాత్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఫైనల్స్‌కు చేరింది.
టాస్ గెలిచిన గుజరాత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆర్‌సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి అవుటైనా, విరాట్ కోహ్లీ (43), దేవదత్ పడిక్కల్ (30) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా కృనాల్ పాండ్యా 43 పరుగులు, చివర్లో జితేష్ శర్మ 15 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్, కాగిసో రబడ చెరో రెండు వికెట్లు తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (14) హిట్ వికెట్‌గా వెనుతిరగ్గా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జోస్ బట్లర్ 11 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి కాస్త ఆశలు రేపినా హేజిల్‌వుడ్ అతడిని అవుట్ చేశాడు. నిషాంత్ సింధు (5), వాషింగ్టన్ సుందర్ (8), జేసన్ హోల్డర్ (0) వరుసగా అవుట్ కావడంతో గుజరాత్ 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్ తవాటియా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. రషీద్ ఖాన్ (8), రబడ (9), సిరాజ్ (5) విఫలం కావడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ముగిసింది.
బౌలర్లు సమిష్టిగా రాణించి ఆర్‌సీబీ విజయానికి బాటలు వేశారు.. బెంగళూరు బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ 39 పరుగులిచ్చి 3 వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, రసిఖ్ సలామ్, కృనాల్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టి గుజరాత్ నడుం విరిచారు. జోష్ హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ భారీ విజయంతో ఆర్‌సీబీ ఫైనల్ పోరుకు అర్హత సాధించగా, గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మైదానంలో ఆర్‌సీబీ చూపించిన పట్టుదల, ఆటతీరు వారిని ఈ స్థాయికి చేర్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

