కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న తర్వాత నుంచి బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా ఎన్నికల్లో ఓటమి రావడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచడం, ప్రజల సమస్యలను టేకప్ చేసి ఆందోళనలకు శ్రీకారం చుట్టడం మొదలుపెట్టింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ అమెరికా వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రెసిడెంట్‌గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గానీ దీనిపై ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రికి హరీశ్‌రావు లేఖ రాశారు. ఈ రెండూ పార్టీని ఇరకాటంలో పెట్టాయి. పార్టీ వైఖరిపై క్లారిటీ లేకముందే హరీశ్‌రావు ఈ ప్రస్తావన తేవడంతో ఇటు సమర్ధించుకోలేక అటు వ్యతిరేకించలేక అధినేత కేసీఆర్ ఇరకాటంలో పడ్డారు.
వ్యాట్‌ను తగ్గించే ప్రసక్త లేదని అప్పట్లో కేసీఆర్ :
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్న సందర్భంగా 2021లో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలని ప్రధాని మోదీ తెలంగాణకు విజ్ఞప్తి చేశారు. కరోనా తదనంతర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నదంటూ కేసీఆర్ వ్యాట్ తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ విజ్ఞప్తికి రియాక్షన్‌గా 2021 నవంబరు 7న మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్లు.. “తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక వ్యాట్ పెంచలేదు… ఒక్క పైసా కూడా పెంచనప్పుడు తగ్గించాల్సిన అవసరం ఏముంది?.. ధరలు పెంచినోడే తగ్గించాలి… కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వేసిన ‘సెస్’ మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయాలి.. ఆ పని చేయకు,డా రాష్ట్రాలను తగ్గించమనడం మూర్ఖత్వం.. మేము వ్యాట్ తగ్గించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. నిజానికి 2015లోనే (జీవో నెం 3, 237) తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. అప్పటివరకూ పెట్రోలుపై 31% వ్యాట్ అమలులో ఉంటే దాన్ని 35.20 శాతానికి పెంచుతూ కమర్షియల్ టాక్స్ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా 2015 డిసెంబరు 17న ఉత్తర్వులు ఇచ్చారు. డీజిల్‌పై ఉన్న 22.25% వ్యాట్‌ను 27 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాన్ని కేసీఆర్ ‘పెంపు’గా పేర్కొనడంలేదు. పన్ను సవరణ అని సమర్ధించుకున్నారు.
కాంగ్రెస్‌కూ ఇదే సూత్రం వర్తించనున్నదా? :
వ్యాట్‌ను పెంచినప్పటికీ పెంచలేదని, సవరించామని అప్పటి ముఖ్యమంత్రి సరికొత్త భష్యం చెప్పడం అప్పట్లోనే విమర్శలకు దారితీసింది. పెంచనప్పుడు తగ్గించే అంశమే ఉత్పన్నం కాదనే తీరులో వివరణ ఇచ్చారు. సరిగ్గా ఇప్పుడు ఇదే సూత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందనే అంశాన్ని హరీశ్‌రావు విస్మరించారనే మాటలు హస్తం నేతల నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచలేదని, అలాంటప్పుడు తగ్గించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఆనాడు కరోనా పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో ముడిచమురు సంక్షోభం నెలకొన్నది. ఇప్పుడు వ్యాట్‌ను తగ్గించాలని హరీశ్‌రావు కోరే ముందు 2015లో కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలన్నది కాంగ్రెస్ నేతల వాదన. ఆ రోజు కేసార్ క్యాబినెట్‌లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ (Harish Rao) రాసి కేసీఆర్‌ను ఇరుకును పెట్టారు.

