కృణాల్, భువి స్పెషల్ షో.. ముంబై‌పై ఆర్‌సీబీ ఘన విజయం

క‌లం, వెబ్‌డెస్క్‌: రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ (MI)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కృణాల్ అదరగొడితే, బౌలింగ్‌లో భువనేశ్వర్ తన తడాఖా చాటాడు. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన పోరులో ఆఖరుకు ఆర్‌సీబీ సరిగ్గా టార్గెట్‌ను ఛేజ్ చేసి విజయం అందుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా చేతులెత్తేసినా కృణాల్ పాండ్యా ఒక్కడు నిలబడి ఈ మ్యాచ్ గెలిపించాడనడంలో అతిశయోక్తి ఉండదేమో. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా భువనేశ్వర్ మెరిశాడు. ఆడింది రెండు బంతులే అయినా 7 పరుగులు చేసి మ్యాచ్‌ను తమకు ఫేవర్‌గా మార్చేశాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం ఏమాత్రం కలిసి రాలేదు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (2) త్వరగానే పెవిలియన్ చేరగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ (0) అయి షాక్ ఇచ్చాడు. రోహిత్ శర్మ 10 బంతుల్లోనే 22 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి మెరుపులు మెరిపించినా, భారీ స్కోరు చేయలేకపోయాడు. 28 పరుగులకే 3 వికెట్లు పడి కష్టాల్లో ఉన్న జట్టును తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో ముంబై కోలుకుంది. చివర్లో ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత స్పెల్ వేశాడు. 23 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ (0) క్లీన్ బౌల్డ్ కాగా, పడిక్కల్ (12), పాటిదార్ (8) విఫలమయ్యారు. ముంబై బౌలర్ కోర్బిన్ బాష్ 4 వికెట్లతో చెలరేగడంతో ఆర్‌సీబీ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కృణాల్ పాండ్యా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 46 బంతుల్లో 73 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. జేకబ్ బెథెల్ (26), జితేశ్ శర్మ (18) విలువైన పరుగులు జోడించారు. చివర్లో కృణాల్ అవుట్ అయినా, భువనేశ్వర్ కుమార్ (7 నాటౌట్) ఒక సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో ఆర్‌సీబీ 19.6 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో బ్యాట్‌తో కృణాల్, బంతితో భువీ ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>