కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026) లో భాగంగా చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ (RCB) ఆకాశమే హద్దుగా చెలరేగింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చూపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ను చిత్తు చేసింది. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ ఆరంభంలో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ తీసుకొని తప్పు చేసిందా.. అన్నట్లుగా ఆర్‌సీబీ విరుచుకుపడింది.
విరాట్ కోహ్లీ (28) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో మంచి ప్రారంభం ఇచ్చినా, అన్షుల్ కాంబోజ్ షార్ట్ బంతికి దొరికిపోయి గ్యాలరీల్లో నిశ్శబ్దం నెలకొల్పాడు. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం నిలవలేదు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ స్కోరింగ్‌లో జోరు చూపించారు. పడిక్కల్ కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించి చెన్నై బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మిడిల్ ఓవర్లలో రజత్ పాటిదార్ కేవలం 18 బంతుల్లో 6 సిక్సర్లతో 48 పరుగులు చేయడం చెన్నై బౌలర్లకు నరకం చూపించింది. చివర్లో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 8 సిక్సర్లతో 70 నాటౌట్ పరుగులు చేసి ఆర్‌సీబీ స్కోరును 250కి తీసుకెళ్లాడు.
251 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆరంభంలోనే కష్టాల్లో పడింది. జాకబ్ డఫ్ఫీ తన స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను ముక్కలు చేశాడు. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు సాధించిన తొలి పేసర్‌గా రికార్డు సాధించాడు. మూడు కీలక వికెట్లు మొదటి మూడు ఓవర్లలోనే కోల్పోవడం చెన్నై ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపింది. చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (63), సమీర్ రిజ్వీ (43) ప్రయత్నాలు చేసినా, 20 ఓవర్లలో చెన్నై 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

