కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట(Siddipet) జిల్లాలోని గజ్వేల్ (Gajwel) లో ఉన్న కేసీఆర్(KCR) క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలు అంక్షారెడ్డితో సహా మరో 42 మందిపై కేసులు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిన్న అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనతో గజ్వేల్ (Gajwel) లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కేసులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

