కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించిన చర్యలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న సీఎం.. డిజిటల్ గవర్నెన్స్ తో ముందుకు వచ్చేందుకు క్షేత్రస్థాయి అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించి ఒక సమగ్ర కార్యాచరణ తీసుకురాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.
అందుకే డిజిటల్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం..
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతోపాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు. ప్రభుత్వం చెల్లింపులు చేసినా.. సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

