కలం, వెబ్ డెస్క్ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది. హోమ్, ఆటో, పర్సనల్ తదితర వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ప్రైమరీ వడ్డీ రేటైన ‘రెపో రేటు’ను (RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ తాజా పెంపుతో రెపో రేటు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. కాగా, ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతున్నాయని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. వరుసగా మూడు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యాన్ని దాటి 4.82%కి చేరడం, అలాగే దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8% వద్ద బలంగా కొనసాగుతుండటంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు వైపు మొగ్గు చూపింది. విధాన వైఖరిని కూడా ‘న్యూట్రల్’ నుంచి ‘కాలిక్యులేటెడ్ టైటెనింగ్’ కు మార్చినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
దీంతో ఈ రెపో రేటు (RBI Repo Rate) పెంపు ప్రభావం నేరుగా వాణిజ్య బ్యాంకులపై పడనుంది. బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడటంతో, సామాన్యులపై ఈఎంఐల భారం మరింత పెరగనుంది. హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు, బిజినెస్ లోన్లపై వడ్డీ రేట్లు ప్రియం కానున్నాయి. ఫలితంగా నూతనంగా రుణాలు తీసుకునే వారితో పాటు, ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై రుణాలు పొందిన వారి నెలవారీ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి పెరిగే అవకాశం ఉంది.
Also Read : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులు ఖరారు.. ఉత్తర్వులు జారీ!
Follow Us On: Instagram

