కలం, వెబ్ డెస్క్ : టీమిండియా యువ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆలోచనతో జాతీయ జట్టు గౌరవం, విలువను తగ్గించకూడదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తర్వాత భారత జట్టు షెడ్యూల్ చాలా బిజీగా ఉండటంతో, టీ20ల కోసం ఇండియా-A, ఇండియా-B అనే రెండు జట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆలోచనపై అశ్విన్ తీవ్రంగా స్పందించారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని జాతీయ జట్టు హోదాను పక్కన పెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇండియా క్యాప్ ధరించడం గర్వకారణం. దానికి ప్రత్యేక విలువ ఉండాలి’ అని ఆయన అన్నారు. అవసరమైతే ఇండియా-A పర్యటనలు నిర్వహించి యువ ఆటగాళ్లకు ఎక్స్‌పోజర్ ఇవ్వవచ్చని సూచించారు.
ప్రస్తుతం ఆటగాళ్ల అరంగేట్రాలు చాలా ఎక్కువగా జరుగుతుండటంతో, వారి డెబ్యూ స్పెషల్‌గా అనిపించడంలేదని ఆయన (Ravichandran Ashwin) ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ తరఫున ఆడటం ఒక గొప్ప గౌరవమని, దాన్ని తగ్గించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టుకు భారీ టీ20 షెడ్యూల్ ఉంది. జూన్ 6 నుంచి 20 వరకు ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లతో సీజన్ ప్రారంభం కానుంది. ఆ వెంటనే జూన్ నెలాఖరులో ఐర్లాండ్ పర్యటన, జూలైలో ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు జరగనున్నాయి. అదే నెలలో జింబాబ్వే పర్యటన ముగించుకుని, అక్టోబర్ 6 నుంచి 17 వరకు స్వదేశంలో వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. చివరగా డిసెంబర్ నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌తో ఏడాది ముగియనుంది.

