కలం, వెబ్ డెస్క్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ఉగ్రవాది’ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) తీవ్రంగా స్పందించారు. ఈ తరహా అవమానకరమైన భాష కాంగ్రెస్ పార్టీ దిగజారుడు మనస్తత్వానికి మరియు వారి వికృత బుద్ధికి సజీవ నిదర్శనమని ఆయన విమర్శించారు. దేశ ప్రధానిపై కాంగ్రెస్ నేతలు ఇలాంటి విషం కక్కడం ఇదే మొదటిసారి కాదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పలేక పూర్తిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే ఇలా వ్యక్తిగత దూషణలకు, నీచమైన పదజాలానికి దిగజారుతోందని రాంచందర్ రావు (Ramchander Rao) పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి అసహనానికి గురవుతున్నారని, వారి వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ నీచమైన సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు.

