కలం, జోగుళాంబ గద్వాల: జిల్లాలో చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి జూన్ 30వ తేదీన గద్వాల (Gadwal) ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్డీవో శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 14 చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు వివిధ మండలాల నుంచి మొత్తం 148 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
అయితే అలంపూర్ మండలంలోని క్యాతూర్ చౌక ధరల దుకాణం డీలర్ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాల కారణంగా ఆ గ్రామానికి సంబంధించిన ప్రవేశ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన 13 డీలర్ పోస్టులకు 144 మంది అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకే గద్వాల ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుతో పాటు దరఖాస్తు ఫారమ్ జిరాక్స్ ప్రతిని వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, డిజిటల్ గడియారాలు అనుమతించబడవని స్పష్టం చేశారు. ఈ ప్రవేశ పరీక్ష 60 నిమిషాల వ్యవధితో 50 మార్కులకు నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రశ్నాపత్రం బహుళ ఎంపిక (Multiple Choice Questions – MCQ)విధానంలో ఉంటుందని, ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఇవ్వబడతాయని, సరైన సమాధానాన్ని ఏ/బీ/సీ/డీ రూపంలో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో గుర్తించాల్సి ఉంటుందని వివరించారు.
అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే డీలర్ల ఎంపిక చేపట్టబడుతుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాన్ని ముందుగానే అందుబాటులో ఉంచినందున అభ్యర్థులు దాని ఆధారంగా సన్నద్ధం కావాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత మండల తహశీల్దార్లు తమ కార్యాలయ నోటీసు బోర్డులపై ఈ ప్రకటనను ప్రదర్శించి, దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి పరీక్ష వివరాలను తెలియజేయాలని, అలాగే పరీక్ష రోజున సంబంధిత గిర్దావర్, జీపీఓ అధికారులు విధిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో శ్రీనివాసరావు ఆదేశించారు.

