కలం, వెబ్‌డెస్క్: మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని ఎస్పీ జానకి (SP Janaki) అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (Nasha Mukt Bharat Abhiyaan) కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో స్టేడియం గ్రౌండ్‌లో ‘మాదకద్రవ్యాల నిర్మూలన’పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముందుగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం సిగ్నేచర్ క్యాంపెయినింగ్ బోర్డుపై సంతకం చేసి కార్యక్రమానికి తమ మద్దతును తెలియజేశారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ జానకి అధికారులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్‌తో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన వ్యక్తి మాత్రమే కాకుండా, వారి కుటుంబం, సమాజం మొత్తం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని అన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, సమాజాన్ని వ్యసన రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనా, డీఎల్‌ఎస్‌ఏ టీం, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి, వర్నిక ఎన్‌జీఓ, జిల్లా అధికారులు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

