కలం, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రష్మిక.. ఈ సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించనుంది. దర్శకుడు రావీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండ్ తెగకు చెందిన యువతిగా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమా కోసం తాను చేసిన సన్నాహాల గురించి రష్మిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. షూటింగ్ ప్రారంభానికి చాలా కాలం ముందే ‘మైసా’గా మారే ప్రయాణం మొదలైందని తెలిపింది. శిక్షణ, ప్రత్యేకమైన సన్నాహాలు, ప్రతిరోజూ ఎదురైన సవాళ్లు తనకు కొత్త అనుభూతిని ఇచ్చాయని చెప్పింది. గతంలో ఎప్పుడూ చేయని పనులను ప్రయత్నిస్తూ తనను తాను కొత్తగా మలుచుకున్నానని పేర్కొంది. ఈ పాత్ర కోసం రష్మిక పడిన కష్టం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

