కవ్వంపల్లి కనుసన్నల్లో జోరుగా ఇసుక దందా.. రసమయి ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: ​కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ వాగులు ఉన్నా.. ఆ వాగుల్లోని ఇసుకను చెరబట్టి అమ్ముకునేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్ధపడ్డారని ఆయన మండిపడ్డారు. ​ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇసుక క్వారీని రసమయి బాలకిషన్.. బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భారీగా అక్రమ ఇసుక తరలింపు..

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మానేరులో మట్టి పూడికతీత పేరుతో భారీగా అక్రమ ఇసుక తరలింపు జరుగుతోందని ఆరోపించారు. రాత్రి వేళల్లో భారీ డంపులు ఏర్పాటు చేసి లారీల ద్వారా ఇసుకను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని విమర్శించారు. ​షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. నియోజకవర్గంలోని కొత్తపల్లి, రేణికుంట, ఊటూరు, పోతూరు తదితర ప్రాంతాల్లోని వాగుల్లో బహిరంగంగా ఇసుక దోపిడీ చేస్తూ అమ్ముకుంటున్నారని రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు.

అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి..

సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ​తమ దోపిడీకి సహకరిస్తున్న స్థానిక అధికారులకు మూడుపులు ఇస్తూ.. ఈ అక్రమాలను ప్రశ్నించే సిన్సియర్ అధికారులను మాత్రం బదిలీలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

పోలీస్, మైనింగ్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ అక్రమ ఇసుక దందాను నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రసమయి డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు స్పందించని పక్షంలో.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి. వి. రామకృష్ణా రావుతో పాటు, ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>