కలం, వెబ్ డెస్క్: మే 10న తెలంగాణకు విచ్చేయనున్న ప్రధాని మోదీ సుమారు రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్‌రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో శనివారం నిర్వహించిన జిల్లా మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జహీరాబాద్‌లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదేవిధంగా హఫీజ్‌పేట్, జోగులాంబ గద్వాల్‌లోని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారి ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్ వంటి మరిన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా అమలులోకి రానున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ (Revanth Government)పై రామ్‌చందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. నెల మొదటి తేదీన జీతాలు అందకపోవడం, ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యమవడం, 2015 నుండి పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యమవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. హైకోర్టు జోక్యం చేసుకుని, నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను కార్పొరేషన్ సిబ్బందిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని రామ్‌చందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. తాను స్వయంగా పలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించానని..అక్కడ వరి ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు, కొందరు అధికారులు కుమ్మక్కై రైతులకు నష్టం కలిగిస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి ఏర్పడటం పూర్తిగా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. వరి రైతులే కాకుండా మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మొక్కజొన్నను కూడా ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

