కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో, సకాలంలో కొనుగోళ్లు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు (Ramchander Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించేందుకు ఆయన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులను పరిశీలించి, కొనుగోళ్లు జరగక అవస్థలు పడుతున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా “రైతు గోస – బీజేపీ భరోసా” పేరుతో యాత్ర నిర్వహిస్తున్నట్లు రాంచందర్ రావు ఈ సందర్భంగా వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కులకచర్లలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతోందని, నిర్మల్ జిల్లా సారంగపూర్‌లో బీజేఎల్పీ నేత అలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
ముందస్తు ప్రణాళిక లేదు.. మౌలిక వసతుల్లేవ్..
వరి సాగులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచందర్ రావు విమర్శించారు. వ్యవసాయ శాఖ నుంచి ముందే ధాన్యం ఉత్పత్తి అంచనాల నివేదికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్లే ఐకేపీ కేంద్రాల్లో గత 25 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస అవసరాలైన గన్నీ బ్యాగులు (సంచులు), రవాణాకు లారీలు, టార్పాలిన్ పట్టాలు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు.
కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు కొనట్లే..
గన్నీ బ్యాగుల కొనుగోలు, రవాణా సౌకర్యాలు, హమాలీ ఛార్జీలకు కావలసిన నిధులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో పూర్తి స్థాయిలో సమకూరుస్తోందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించకుండా కాలయాపన చేస్తూ రైతులపై భారాన్ని నెడుతోందని రామచందర్ రావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రతిఏటా మద్దతు ధర పెంచుతూ అన్నదాతను ప్రోత్సహిస్తుంటే, ఇక్కడి ప్రభుత్వం మాత్రం కొనేందుకు సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. రైతుల నుంచి తేమ, తరుగు పేరుతో ప్రతి బస్తాకు దాదాపు 4 కిలోల చొప్పున కోత విధిస్తూ నిలువునా దోచుకుంటున్నారని, హమాలీ ఛార్జీలను కూడా రైతుల నుంచే వసూలు చేయడం అత్యంత అన్యాయమని మండిపడ్డారు.

