కాంగ్రెస్ అసమర్థతతో ఎండుతున్న పంటలు: రాంచందర్ రావు

కలం, నల్లగొండ బ్యూరో: ముందస్తు ప్రణాళికలు, దూరదృష్టి లేకపోవడం వల్లే తెలంగాణలో తీవ్ర సాగు, తాగునీటి ఎద్దడితో పాటు విద్యుత్ సంక్షోభం తలెత్తిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే రైతుల పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. నల్లగొండ జిల్లాలోని కనగల్, నల్లగొండ రూరల్ మండలాలు, చిన్న మాదారం తదితర ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోరుబావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులను కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం 12 నుండి 15 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతోందని, క్షేత్రస్థాయిలో రైతులకు గరిష్టంగా 5 గంటలు కూడా కరెంట్ అందడం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. తీవ్రమైన విద్యుత్ ట్రిప్పింగ్‌లు, బ్రేక్‌డౌన్ల వల్ల బోర్ల నుండి నీటిని తోడుకోలేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత నెపంతో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని, సింగరేణి, జెన్కో, డిస్కమ్‌ల మధ్య సమన్వయం లోపించడమే కాకుండా హైడల్, సోలార్ వనరులను వాడుకోవడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందన్నారు.

ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయని తెలిసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. కర్ణాటక తరహాలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయించాలని, బాధితులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కేవలం పంటలు వేయవద్దని చెప్పడం కాకుండా, ఎఫ్‌పీఓలు, వ్యవసాయ అధికారుల ద్వారా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

కృష్ణా జలాల్లో రాజీ పడేది లేదు: రామచందర్ రావు

నాగార్జునసాగర్ నుండి హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం ఇప్పటినుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుండి దిగువకు నీటిని విడుదల చేయించేలా ఒత్తిడి తేవాలన్నారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ భేటీలలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాపై ఎలాంటి రాజీ పడకుండా గళం విప్పాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నికర జలాలు తరలుతున్న అంశంపై ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చేసిన సూచనలను ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందుంచాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. చిన్న ప్రాజెక్టుల పూడికతీత, మరమ్మతులను విస్మరించడం వల్లే నీటి సమస్యలు పెరిగాయని, జూరాల, నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి, ఆర్డీఎస్ ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>