కలం, నిర్మల్: “అధ్యక్షా.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభం అవుతున్నాయి. సినిమా హీరోయిన్స్ వస్తున్నారు. మున్సిపల్ పాలక వర్గ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులకు కనీస ఆహ్వానం లేదు. ఇదేం ప్రోటోకాల్ అధ్యక్షా..! ప్రారంభోత్సవానికి చైర్పర్సన్ తో కలిసి వెళ్లొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాకు ఆహ్వానించకపోవడం సరి కాదు” అంటూ అధికార పార్టీ కౌన్సిలర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు ఆయనకు మద్దతు తెలిపారు.
బుధవారం నిర్వహించిన నిర్మల్ (Nirmal) మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మరో పక్క.. మాల్స్ నిర్మాణానికి తగిన అనుమతులున్నాయా అసలు, వాళ్లకి అనుమతులు రద్దు చేయాలంటూ మరి కొందరు ప్రతిపాదించారు. ప్రజా సమస్యలను చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన పాలకవర్గం ఇలా ప్రైవేట్ కార్యక్రమాల ఆహ్వానంపై మాట్లాడుకోవడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

